Sri Chaitanya Educational Institutions: శ్రీ చైతన్య విద్యా సంస్ధలలో రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ చోరీ!
- విద్యాసంస్థల నిర్వహణ కోసం విలువైన సాఫ్ట్ వేర్ కొనుగోలు
- ఇటీవల మొరాయించిన సాఫ్ట్ వేర్
- విద్యార్థుల వివరాల్లో సమగ్రత లోపించిన వైనం
- పూర్వ సిబ్బందిపై యాజమాన్యం అనుమానం
- పోలీసులకు ఫిర్యాదు
కృష్ణా జిల్లాలోని పునాదిపాడులో ఉన్న శ్రీచైతన్య క్యాంపస్ లో రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ చోరీ అయినట్టు గుర్తించారు. కంకిపాడు పోలీసుల కథనం ప్రకారం... ఛైతన్య విద్యాసంస్ధల నిర్వహణ కోసం సుమారు రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ను యాజమాన్యం వినియోగిస్తోంది. మరెవరు తమ సమాచారం సంగ్రహించే అవకాశం లేకుండా, అన్ని భద్రతలతో రూపొందించిన సాప్ట్ వేర్ ను సంస్ధ కొనుగోలు చేసింది.
అయితే, ఇటీవల సంస్ధకు చెందిన సాఫ్ట్ వేర్ పని చేయకపోవటం, విధ్యార్ధుల వివరాలు, నగదుకు సంబంధించిన వివరాలలో సమగ్రత లోపించటంతో అనుమానం వచ్చిన సిబ్బంది దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలో, ఈ వ్యవహారంపై కళాశాల యాజమాన్యానికి పూర్వ సిబ్బందిపై అనుమానం రావటంతో తదనుగుణంగా కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కళాశాలలో ఎగ్జిక్యూటివ్ డీన్ హోదాలో పనిచేసిన నరేంద్రబాబు, డీన్ శ్రీనివాసరావు, బాలకృష్ణ ప్రసాద్ లపై తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
విద్యార్ధులకు సంబంధించిన డేటాను సైతం తస్కరించారని, ఆ డేటా ఆధారంగా పెనమలూరులో శ్రీ గోస లైట్స్ మెడికల్ అకాడమీ పేరిట మరొక విద్యాసంస్ధను ఏర్పాటు చేసుకుని తమ విద్యార్ధుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ తక్కువ ఫీజులు తీసుకుంటామని వారికి చెబుతున్నారని చైతన్య యాజమాన్యం ఆరోపించింది.
సదరు విద్యార్ధుల తల్లిదండ్రులే ఈ విషయాన్ని చైతన్య విద్యాసంస్ధల దృష్టికి తీసుకురావటంతో ఆందోళనకు గురైన యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రస్తుత కళాశాల ఏజీఎం మురళీకృష్ట కంకిపాడు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.