Oxygen: రూ. మూడు వేల నుంచి రూ. 600కు పడిపోయిన ఆక్సిజన్ రీఫిల్లింగ్ ధరలు!
- ఏప్రిల్ తొలి వారం తర్వాత అమాంతం పెరిగిన రీఫిల్లింగ్ ధర
- ఒకానొక దశలో రూ. 3 వేలకు చేరిన వైనం
- రూ. 70 వేల నుంచి రూ. 25 వేలకు పడిపోయిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు
- కేసులు తగ్గడం, ఆక్సిజన్ అందుబాటులో రావడంతో తగ్గిన ధరలు
నిన్నమొన్నటి వరకు వేలల్లో ధర పలికిన మెడికల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు అమాంతం తగ్గాయి. పెద్ద సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ. 2000-3000 వరకు పలకగా తాజాగా దాని ధర రూ. 600కు పడిపోయింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు రూ. 60-70 వేల నుంచి రూ. 15-25 వేల మధ్య పలుకుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, చాలినంత ఆక్సిజన్ అందుబాటులోకి రావడమే ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.
ఆక్సిజన్‌కు అంతగా గిరాకీ లేని ఏప్రిల్ మొదటి వారంలో 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపేందుకు రూ. 350 తీసుకునేవారు. ఆ తర్వాత గిరాకీ పెరగడంతో ఆ ధర రూ. 600కు పెరిగింది. అదే నెల 20 నాటికి రూ.1000కి పెరగ్గా ఈ నెల మొదటి వారానికి మరింత పెరిగి రూ. 2500 నుంచి రూ. 3 వేలకు చేరింది.
ఇప్పుడు పలు సంస్థలు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుండడంతోపాటు అక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా రీఫిల్లింగ్ ధరలతోపాటు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.