Lockdown: లక్షలాది ప్రాణాలను కాపాడిన లాక్ డౌన్: ఆక్స్ ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ కేసులు తగ్గుదల
- ప్రతి దేశంలోనూ 6 వేల కేసులు తక్కువగా నమోదు
- 26 దేశాల డేటాను విశ్లేషించి పరిశోధకుల అంచనా
ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించడం వల్ల లక్షలాది ప్రాణాలను కాపాడుకోగలిగామని, మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, న్యూజిలాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేలింది. లాక్ డౌన్ తో కరోనాతో పాటు న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వంటి బ్యాక్టీరియల్ జబ్బుల సంక్రమణ కూడా భారీగా తగ్గిందని పేర్కొంది.
కరోనా వైరస్ లాగానే ఆయా వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలూ శ్వాసకోశ వ్యవస్థ ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తాయని అధ్యయనం పేర్కొంది. లాక్ డౌన్ లతో గత ఏడాది జనవరి నుంచి మే మధ్య ఆ వ్యాధులకు సంబంధించిన కేసులు భారీగా తగ్గాయని వెల్లడించింది. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే ప్రతి దేశంలోనూ కేసులు సగటున 6 వేలు తగ్గాయని తెలిపింది.
లాక్ డౌన్ విధించిన 4 వారాల్లో స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా కేసులు 68 శాతం, 8 వారాల్లో 82 శాతం మేర తగ్గాయని, అదే సమయంలో స్ట్రెప్టోకోకస్ ఆల్గాలాక్టియే కేసులు మాత్రం తగ్గలేదని వివరించింది. 26 దేశాలకు చెందిన జాతీయ లేబొరేటరీలు, నిఘా కార్యక్రమాలకు సంబంధించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు ఈ అంచనాలకు వచ్చారు. కాగా, ఒక్క 2016లోనే ప్రపంచవ్యాప్తంగా 33.6 కోట్ల మంది శ్వాసకోశ జబ్బుల బారిన పడగా, 24 లక్షల మంది చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.