AP High Court: అందుకే కరోనా మందును అడ్డుకుంటున్నారు: హైకోర్టుకు తెలిపిన ఆనందయ్య న్యాయవాది
- ఫార్మా కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి
- ఔషధం పంపిణీకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు
- పంపిణీ చేసే హక్కు ఆనందయ్యకు ఉంది
నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా ఔషధం పంపిణీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఆ మందుపై ప్రభుత్వం కాసేపట్లో సమీక్ష జరపనుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
ఆనందయ్య ఔషధం తీసుకున్న తర్వాత 130 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారని, మరోపక్క ఆ మందుపై ఆయుష్ నివేదిక ఇంకా రాలేదని చెప్పారు. దీనిపై స్పందించిన ఆనందయ్య తరఫు న్యాయవాది 130 మంది ఆసుపత్రిలో చేరితే దానిపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
అసలు ఔషధం పంపిణీకి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. ఔషధాన్ని పంపిణీ చేసే హక్కు ఆనందయ్యకు ఉందని ఆయన వివరించారు. పలు ఫార్మా సంస్థలు ఒత్తిడి తీసుకువస్తున్నందునే ఆనందయ్య ఔషధాన్ని పంపిణీ చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది.