COVID19: కరోనా పుట్టుక తెలియకుంటే.. కొవిడ్ 26, కొవిడ్ 32 కూడా ముంచుకొస్తాయి: అమెరికా నిపుణుల హెచ్చరిక!
- ఇద్దరు అమెరికా నిపుణుల హెచ్చరిక
- హ్యూబెయ్ లో ఏడాది పాటు పరిశోధన చేయాలని సూచన
- శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టులను పంపాలని కామెంట్
కరోనా వైరస్.. రెండేళ్ల క్రితం బయటపడి, మహమ్మారిగా మారి ప్రపంచానికి చుక్కలు చూపిస్తోంది. 2019లో బయటపడింది కాబట్టి.. దానికి కొవిడ్ 19 అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) పేరు పెట్టింది. అయితే, అది ఎక్కడ పుట్టింది? ఎలా మనిషికి సోకింది? వంటి వివరాలను తేల్చకపోతే కొవిడ్ 26, కొవిడ్ 32 ముప్పు కూడా ముంచుకొస్తుందని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్ డీఏ) కమిషనర్ గా, ఇప్పుడు ఫైజర్ బోర్డు సభ్యుడిగా ఉన్న స్కాట్ గాట్ లీబ్, టెక్సాస్ చిల్డ్రన్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్ మెంట్ కో– డైరెక్టర్ పీటర్ హొటెజ్ లు ఈ వ్యాఖ్యలు చేశారు.
వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ తయారైందనడానికి ఎన్నో ఆధారాలున్నాయని, కానీ, అది అబద్ధమని చెప్పే ఆధారాలను మాత్రం చైనా చూపించలేకపోయిందని గాట్ లీబ్ అన్నారు. ఇక, దాని పుట్టుక గురించి తెలియకపోతే ప్రపంచానికి మరిన్ని ముప్పులు తప్పవని పీటర్ హొటెజ్ హెచ్చరించారు.
శాస్త్రవేత్తలు, ఎపిడెమియాలజిస్టులు, వైరాలజిస్టులు, గబ్బిల జాతుల పరిశోధకులను హ్యూబెయ్ ప్రావిన్స్ లో ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఉంచాలని, అక్కడే కరోనా పుట్టుకపై అధ్యయనం చేయించాలని సూచించారు. కాగా, కరోనా మీద సమగ్ర దర్యాప్తు చేయించాల్సిందిగా ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆదేశించారు.