ABN: ఏబీఎన్, టీవీ5లపై దేశద్రోహం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- రఘురాజు కేసులో ఏబీఎన్, టీవీ5లపై జగన్ సర్కార్ దేశద్రోహం కేసులు
- రెండు ఛానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకూడని సుప్రీం వ్యాఖ్యలు
- దేశద్రోహం కేసును ప్రతి రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని వ్యాఖ్య
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన వ్యవహారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఏపీ ప్రభుత్వం తెలుగు వార్తా ఛానళ్లు ఏబీఎన్, టీవీ5లపై కూడా దేశద్రోహం కేసులు నమోదు చేసింది. దీంతో, ఈ రెండు ఛానళ్లు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ బెంచ్ లో జస్టిస్ చంద్రచూడ్ తో పాటు... జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ ఉన్నారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నంలా (muzzle media freedom) ఉందని వ్యాఖ్యానించింది. దేశద్రోహం చట్టానికి సంబంధించిన పరిమితులను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ రెండు ఛానళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని విచారణ సందర్భంగా ఛానళ్ల తరపు న్యాయవాదులు సుప్రీంను కోరారు. దీంతో, ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ... తదుపరి విచారణ వరకు ఈ రెండు ఛానళ్లపై కానీ, వాటి సిబ్బందిపై కానీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. ప్రతి రాష్ట్రం దేశద్రోహం కేసును దుర్వినియోగం చేస్తోందని... ఈ అంశాన్ని తాము చాలా సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపింది. రాజద్రోహం కేసుల నమోదుపై తాము పూర్థి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్పింది.