Curfew: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు
- కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
- కర్ఫ్యూ పొడిగింపుకే మొగ్గుచూపిన సీఎం
- ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు సడలింపులు యథాతథం
- రాష్ట్రంలో తగ్గుతున్న కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని బాగా కట్టడి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ సడలింపులో ఎలాంటి మార్పు చేయలేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.
ఏపీ సర్కారు ఇటీవల విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ కొనసాగించడం వల్ల కరోనా ప్రభావాన్ని మరింత తగ్గించవచ్చని ఈ సందర్భంగా సీఎం సహా అధికారులు అభిప్రాయపడ్డారు.
ఏపీలో గత వారం రోజులుగా కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. రోజువారీ కేసులు 15 వేలకు లోపే వస్తున్నాయి. వ్యాక్సినేషన్ ఊపందుకుంటే కరోనా మహమ్మారిని మరింత ప్రభావవంతంగా కట్టడి చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.