Sasikala: వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు.. పార్టీలోకి శశికళకు నో ఎంట్రీ అన్న అన్నాడీఎంకే
- ఆమెకు, పార్టీకి సంబంధం లేదన్న పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్
- పార్టీలో ఎవరూ శశికళతో మాట్లాడలేదని స్పష్టీకరణ
- ఇలాంటి వ్యూహాలకు స్వస్తి పలకాలని హితవు
ఆధ్యాత్మిక మార్గాన్ని వీడి తిరిగి రాజకీయాల్లోకి వస్తానన్న శశికళ ప్రకటనతో తమిళనాట రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. పార్టీ భ్రష్టుపట్టిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేనని, తానొచ్చి మళ్లీ పార్టీని గాడిన పెడతానని తన మద్దతుదారులకు శశికళ భరోసా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే స్పందించింది. శశికళను మళ్లీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పార్టీపై పట్టుకోసం కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి పేర్కొన్నారు.
అన్నాడీఎంకే కార్యకర్తలకు, శశికళకు ఎలాంటి సంబంధం లేదని మునుసామి తేల్చి చెప్పారు. ఆమెను తెరపైకి తెచ్చేందుకు శశికళ మద్దతుదారులు ఆడుతున్న డ్రామా ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీలో ఎవరూ శశికళతో మాట్లాడలేదన్నారు. పార్టీని నిర్మించినది శశికళ లాంటి వారు కాదని, ఎంజీ రామచంద్రన్ పార్టీని స్థాపించినప్పటి నుంచి కార్యకర్తలే పార్టీకి వెలకట్టలేని సేవలు చేశారని పేర్కొన్నారు.
పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అవకాశవాదులు అవాస్తవాలను ప్రచారం చేస్తూ లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటివి మానుకుంటే మంచిదని శశికళకు మునుసామి హితవు పలికారు. కాగా, జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే అధ్యక్షురాలిగా వ్యవహరించిన శశికళ.. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాక అధ్యక్ష స్థానాన్ని కోల్పోయారు.