Britain: బ్రిటన్‌లో థర్డ్ వేవ్ సంకేతాలు.. శాస్త్రవేత్త రవి గుప్తా హెచ్చరిక
- బ్రిటన్‌లో తగ్గుముఖం పట్టిన కేసులు
- మున్ముందు ఉద్ధృతమయ్యేలా పరిస్థితి
- బి.1.617 రకం కేసులే ఎక్కువన్న రవిగుప్తా
కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ అతలాకుతలం కాగా, బ్రిటన్‌లో థర్డ్ వేవ్ సంకేతాలు కనిపిస్తున్నాయని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి గుప్తా హెచ్చరించారు. బ్రిటన్‌లో ప్రస్తుతం అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. అయితే, పరిస్థితి చూస్తుంటే మాత్రం మున్ముందు ఉద్ధృతమయ్యేలా కనిపిస్తోందని అన్నారు.
ఇంగ్లండ్‌లో బయటపడుతున్న కొత్త కేసుల్లో నాలుగింట మూడొంతులు భారత్‌లో బయటపడిన బి.1.617 రకానివేనని అన్నారు. మున్ముందు ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఈ నెల 21 నుంచి తిరిగి అన్ని కార్యకలాపాలను అనుమతించి, మునుపటి స్థితికి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అలాంటి ఆలోచనను పక్కనపెట్టాలని ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రొఫెసర్ రవిగుప్తా కోరారు.