Jagan: బెయిల్ రద్దు పిటిషన్ పై 98 పేజీల కౌంటర్ దాఖలు చేసిన జగన్ న్యాయవాది.. 14కి విచారణ వాయిదా!

Jagan lawyers submits 98 pages counter to CBI court

  • బెయిల్ రద్దు పిటిషన్ ను విచారించిన సీబీఐ కోర్టు
  • థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచ్చింది
  • రఘురాజుపై సీబీఐ కేసు నమోదు చేసిందన్న జగన్ న్యాయవాదులు 

అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ రోజు సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా జగన్ తరపు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు.

కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు గతంలోనే ఆదేశించినా... కొన్ని కారణాల వల్ల ఆయన తరపు న్యాయవాదులు మూడు వాయిదాల వరకు కౌంటర్ దాఖలు చేయలేకపోయారు. దీంతో, గత విచారణ సందర్భంగా కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణ సమయానికి కౌంటర్ దాఖలు చేయకపోయినా... విచారణను ప్రారంభిస్తామని హెచ్చరించింది. దీంతో, ఈరోజు వారు కౌంటర్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా జగన్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ... సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులను వెలువరించిన సందర్భాలు ఉన్నాయని రఘురాజును ఉద్దేశించి అన్నారు.

రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని... ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారని తెలిపారు. రఘురాజుపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని చెప్పారు. బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన అంశంలో రఘురాజుపై సీబీఐ కేసు కూడా నమోదు చేసిందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును ఉపయోగించుకునే ప్రయత్నాన్ని రఘురాజు చేస్తున్నారని విమర్శించారు.

మరోవైపు సీబీఐ కూడా ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసింది. రఘురాజు వేసిన పిటిషన్ పై చట్టప్రకారం తగు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. కోర్టు తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని విన్నవించింది. అనంతరం, కేసు విచారణను కోర్టు 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సీబీఐ కోర్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News