Yanamala: జగన్ విడుదల చేసిన పుస్తకంలో అన్నీ అసత్యాలే ఉన్నాయి: యనమల
- జగన్ రాజకీయ కక్షసాధింపుకే ప్రాధాన్యం ఇస్తున్నారు
- రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు
- అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు
- అసత్యాలతో పుస్తకాన్ని విడుదల చేయటం చేతకానితనానికి నిదర్శనం
వైసీపీ రెండేళ్ల పాలనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. విధ్వంస పాలనే ముఖ్యమంత్రి జగన్ ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనపై ఆయన పుస్తకం విడుదల చేసి గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. అందులో అతస్య అంశాలను పేర్కొన్నారని ఆరోపించారు. నిజాలు చెప్పకుండా అసత్యాలతో నిండిన పుస్తకాన్ని సీఎం హోదాలో ఉన్న వ్యక్తి విడుదల చేయటం అభ్యంతరకరమని యనమల అన్నారు.
జగన్ రాజకీయ కక్షసాధింపు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే అంశాలకే ప్రాధాన్యం ఇస్తూ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఎలాగైనా సరే ప్రతిపక్షాన్ని అణచివేయాలని, రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు.
రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆగిపోయాయని, అసత్యాలతో పుస్తకాన్ని విడుదల చేయటం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. జగన్ అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారని, మరి ఇప్పుడెందుకు దానిని పట్టించుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు.
తనపై ఉన్న క్రిమినల్ కేసుల నుంచి బయటకు రావాలనే ప్రయత్నాల వల్లే ప్రత్యేక హోదా, విభజన హామీలను గురించి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ అడగట్లేదని ఆయన చెప్పారు. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేక ఆర్డినెన్స్‌ల రూపంలో తీసుకొచ్చారని ఆయన విమర్శించారు.
రెండో ఏడాది బడ్జెట్‌కు కూడా ఆర్డినెన్స్ పెట్టడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. ఇందుకు గవర్నర్ కూడా వత్తాసు పలకటం సరికాదని యనమల అన్నారు. కోర్టులను కూడా విమర్శించే అధికారం జగన్ కి ఎక్కడిదని ఆయన నిలదీశారు.
కోర్టులను తప్పుదోవ పట్టించే విధంగా జగన్ నివేదికలు ఇస్తున్నారని, పోలీసులతో రాజ్యం నడుపుతున్నారని యనమల ఆరోపించారు. అలాగే, మీడియాకు ఉన్న స్వేచ్ఛను అణచివేసే అధికారాలను జగన్‌కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.