Credit Card: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లతో కోటీశ్వరుడయ్యాడు!
- అమెరికాలో ఘటన
- గిఫ్ట్ కార్డుల కొనుగోలుతో రివార్డు పాయింట్లు
- గిఫ్టు కార్డులు నగదుగా మార్చుకున్న వైనం
- రివార్డు పాయింట్ల రూపంలో వచ్చిన డాలర్లు ఆదా
- ఆ విధంగా రూ.2.17 కోట్లు సంపాదన
ఆన్ లైన్ చెల్లింపులు జరిపినప్పుడు రివార్డు పాయింట్లు అందుకోవడం సహజం. అయితే అలాంటి రివార్డు పాయింట్లతోనే ఏకంగా కోటీశ్వరుడవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికా దేశస్తుడైన కాన్ స్టాంటిన్ ఆంకీవ్ కు క్రెడిట్ కార్డు వినియోగంతో లభించే రివార్డు పాయింట్లు అంటే ఎంతో మక్కువ. క్రెడిట్ కార్డు వినియోగించడం... దాంతో లభించే రివార్డు పాయింట్లు ఆదా చేయడం.. 2009 నుంచి ఇదొక అలవాటుగా మార్చుకున్నాడు. అది కూడా చాలా తెలివిగా చేసేవాడు.
ఆన్ లైన్ లో గిఫ్టు కార్డులనే కొనుగోలు చేసేవాడు. ఏదైనా గిఫ్టు కార్డు కొంటే అతడికి కొన్ని డాలర్ల మేర రివార్డు పాయింట్లు లభించేవి. తిరిగి ఆ గిఫ్టు కార్డులను తన బ్యాంకు అకౌంట్లోనే జమ చేసుకునేవాడు. ఆ డబ్బుతో తిరిగి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేవాడు. రివార్డు పాయింట్ల ద్వారా వచ్చిన డాలర్లు లాభంగా మిగిలేవి. ఈ విధంగా కాన్ స్టాంటిన్ రూ.2.17 కోట్లు సంపాదించాడు.
పనీపాటా చేయకుండానే అంత సొమ్ము రావడంతో కొందరు అతడిపై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ రివార్డు పాయింట్ల వ్యవహారం వెల్లడైంది. అక్కడి చట్టాల ప్రకారం అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు, అతడి తెలివికి మాత్రం ఫిదా అవుతున్నారు.