Raghu Rama Krishna Raju: ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి
- రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారని ఆరోపణ
- వీడియో ఆధారాలు అందజేత
- ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
- ప్రస్తుతం బెయిల్ పై బయటున్న రఘురామ
తనను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ దారుణమైన రీతిలో వ్యవహరించిందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) కు ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ హెచ్చార్సీ చైర్మన్ పీసీ పంత్ ను కలిసిన రఘురామ తన అరెస్ట్ నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. అయితే, ఆయన ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆయనపై ఎన్ హెచ్చార్సీలో ఫిర్యాదు దాఖలైంది.
రఘురామకృష్ణరాజు ఇటీవల రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామ వ్యాఖ్యల తాలూకు వీడియోలను కూడా కరుణాకర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ కు అందజేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయటున్నారు.