Habib: పులుల పాలిట యమకింకరుడు... ఇన్నాళ్లకు చిక్కాడు!
- బంగ్లాదేశ్ లో టైగర్ హబీబ్ అరెస్ట్
- 70 పులులను వధించిన హబీబ్
- గోర్లు, చర్మం, ఇతర అవయవాల అమ్మకంతో ఆదాయం
- 20 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న వేటగాడు
ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 70 పులుల్ని చంపిన పేరుమోసిన వేటగాడిని బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకున్నారు. పులుల పాలిట యమకింకరుడిగా గుర్తింపు పొందిన హబీబ్ తాలూక్దార్ 20 ఏళ్లుగా పులులను వధిస్తున్నాడు. పులులను చంపడం, వాటి గోర్లు, చర్మం, ఇతర విలువైన అవయవాలను విక్రయించడం అతని దందా. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ను ఆనుకుని ఉండే సుందర్బన్ అడవుల్లో తిరిగే పులులే అతడి లక్ష్యం.
హబీబ్ తాలూక్దార్ అడవి నుంచి తేనె సేకరిస్తూనే, మరోవైపు పులులను వేటాడుతూ అధిక ఆదాయం పొందేవాడు. అతడిని టైగర్ హబీబ్ అని పిలుస్తారు. ఇన్నాళ్లలో పోలీసులకు చిక్కింది లేదు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం అందితే చాలు... సమీపంలోని అడవుల్లోకి వెళ్లి తలదాచుకునేవాడు. పోలీసులు ఆ అడవుల్లోకి వెళ్లలేక వెనుదిరిగి వెళ్లిపోయేవారు. ఈసారి పక్కా సమాచారంతో అతడున్న ప్రదేశంపై దాడి చేసిన పోలీసులు, చిట్టచివరికి అతడిని అరెస్ట్ చేయగలిగారు.