VK Paul: కరోనా నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై నీతి ఆయోగ్ ప్రకటన
- చిన్నారుల్లో కరోనాపై వీకే పాల్ స్పందన
- కరోనా నుంచి కోలుకున్నా సమస్యలు వస్తాయని వివరణ
- వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచన
- ఒక్కోసారి కరోనా లక్షణాలు కనిపించడంలేదని వెల్లడి
దేశంలో పలుచోట్ల చిన్నారులు కూడా కరోనా బారినపడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో చిన్నారుల ఆరోగ్యంపై ప్రకటన చేశారు. కరోనా నుంచి కోలుకున్న 2 నుంచి 6 వారాల మధ్య ఆరోగ్య సమస్యలు రావొచ్చని వెల్లడించారు. పిల్లల్లో సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. అనేకమంది చిన్నారుల్లో కరోనా సోకినప్పటికీ లక్షణాలు కనిపించడంలేదని వీకే పాల్ తెలిపారు.
వైరస్ సంక్రమణ, ప్రవర్తనలో మార్పులొస్తే కరోనా తీవ్రత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా సమస్యలు వస్తే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు. కొందరిలో కోలుకున్న 3 వారాల తర్వాత కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. దేశంలో తాజా పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నామని వీకే పాల్ వెల్లడించారు.