Bharat Biotech: కొవాగ్జిన్ ను ఉత్పత్తి చేయనున్న మరో సంస్థ.. రూ.158 కోట్లు ఇవ్వనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- ఏటా 22.8 కోట్ల డోసులు ఇవ్వనున్న హాఫ్కిన్ బయోఫార్మా
- కేంద్రం రూ.65 కోట్లు, మహారాష్ట్ర రూ.93 కోట్ల సాయం
- భారత్ బయోటెక్ తో తుది దశలో ఒప్పందం
- టెక్నాలజీ మార్పిడి ప్రక్రియ నడుస్తోందన్న హాఫ్కిన్ ఎండీ
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ బీపీసీఎల్) ఉత్పత్తి చేయనుంది. దానికి సంబంధించిన టెక్నాలజీ మార్పిడి ప్రక్రియ నడుస్తోందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ రాథోడ్ తెలిపారు. కాగా, వ్యాక్సిన్ ఉత్పత్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.158 కోట్ల ఆర్థిక సాయం అందనుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్లను శాంక్షన్ చేయగా, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.93 కోట్లు అందనున్నాయని తెలిపారు.
అనుకున్న సమయంలోపే కొవాగ్జిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని, నెలకు 2 కోట్ల డోసుల చొప్పున 11 నెలల్లో 22.8 కోట్ల వరకు టీకాలను తయారు చేస్తామని వివరించారు. ఇప్పటికే టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించి సంతకాలు పూర్తయ్యాయని, ఇక, ఒప్పందమే చేసుకోవాల్సి ఉందని తెలిపారు. కొవాగ్జిన్ ఉత్పత్తికి అవసరమైన బయో సేఫ్టీ లెవెల్ 3 ల్యాబ్ ఏర్పాట్లు చకచకా నడుస్తున్నాయన్నారు. మరో 8 నెలల్లో అది పూర్తవుతుందని చెప్పారు.