anandaiah: ఆనందయ్య మందు తయారీ పెద్ద ఎత్తున ప్రారంభం
- ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి
- ఔషధం తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
- అవసరమైన సామగ్రి కృష్ణపట్నం పోర్టుకు తరలింపు
- ప్రకటించేవరకు ఇతరులు గ్రామంలోకి రావద్దన్న ఆనందయ్య
ఏపీలోని కృష్ణపట్నానికి చెందిన నాటు వైద్యుడు ఆనందయ్య కరోనా మందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చని జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆనందయ్య మందు తయారీ మళ్లీ పెద్ద ఎత్తున ప్రారంభమవుతోంది.
కృష్ణపట్నంలోనే ఆనందయ్య ఔషధం తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణపట్నం పోర్టు వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. తయారీకి అవసరమైన సామగ్రిని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. పంపిణీపై ప్రకటన చేసేవరకు ఇతరులు ఎవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య చెప్పారు. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 114 సెక్షన్ కొనసాగిస్తున్నారు.
కాగా, చాలా మంది జనాలు ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్నారు. మందు పంపిణీపై నిన్న కలెక్టర్ చక్రధర్బాబుతో ఆనందయ్య చర్చలు జరిపారు. మందు తయారీకి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా సాయం అందిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని వారు నిర్ణయించారు. కరోనా నిబంధనల ప్రకారం మందును పంపిణీ చేయనున్నారు. వికేంద్రీకరణ పద్ధతి, ఆన్లైన్ ద్వారా మందుల పంపిణీకి చేయాలని భావిస్తున్నారు.