Pfizer: ఫైజర్ వ్యాక్సిన్ పై ఇజ్రాయెల్ ఫిర్యాదు.. సమీక్షిస్తామన్న ఫైజర్!
- గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మే మధ్య 5 మిలియన్ల మందికి ఫైజర్ టీకా
- 275 మందిలో మయోకార్డిటిస్ లక్షణాలు
- సమీక్ష నిర్వహిస్తున్నామన్న ఫైజర్
ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొందరిలో గుండెలో మంటగా అనిపిస్తోందని తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్ పేర్కొంది. డిసెంబరు 2020 నుంచి మే 2021 మధ్య దేశంలో 5 మిలియన్ల మంది ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే, అందులో 275 మందికి మయో కార్డిటిస్ (గుండె మంట) లక్షణాలు కనిపించినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారు నాలుగు రోజులపాటు చికిత్స పొందినట్టు తెలిపింది. అయితే, ఈ కేసుల్లో 95 శాతం స్వల్ప స్థాయి లక్షణాలేనని పేర్కొంది. నిపుణులతో కూడిన మూడు బృందాలు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని మంత్రిత్వశాఖ తెలిపింది.
వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవడానికి, మయోకార్డిటిస్ మధ్య సంబంధం ఉండొచ్చని ఈ అధ్యయనం అభిప్రాయపడిందని ప్రభుత్వం తెలిపింది. 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారిలో, మరీ ముఖ్యంగా 16 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఈ లక్షణాలు కనిపించినట్టు తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రకటనపై ఫైజర్ స్పందించింది. టీకా తీసుకున్న వారిలో మయోకార్డిటిస్ లక్షణాలు కనిపించినట్టు తమ దృష్టికి వచ్చిందని, అయితే వ్యాక్సిన్‌కు, మయోకార్డిటిస్‌కు మధ్య సంబంధం ఉన్నదీ, లేనిదీ స్పష్టంగా తెలియదని, దీనిపై సమీక్ష జరుపుతామని తెలిపింది. ఈ విషయమై ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వ్యాక్సిన్ సేఫ్టీ విభాగంతో సమావేశమై చర్చిస్తున్నట్టు ఫైజర్ వివరించింది.