Positivity Rate: ఏపీలో మరింత దిగొచ్చిన కరోనా పాజిటివిటీ రేటు... తాజా బులెటిన్ ఇదిగో!
- రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 11,421 కొత్త కేసులు
- తూర్పు గోదావరిలో 2,308 మందికి కరోనా
- రాష్ట్రంలో 81 మంది మృతి
- ఒక్క చిత్తూరు జిల్లాలోనే 13 మంది మృతి
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి మరికాస్త తగ్గినట్టే భావించాలి. ఇటీవల కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. ఇటీవల 25 శాతంగా ఉన్న కరోనా పాజిటివిటీ రేటు ఇప్పుడు 13 శాతంగా నమోదైంది.
గడచిన 24 గంటల్లో 86,223 కరోనా పరీక్షలు నిర్వహించగా 11,421 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,308 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,658 కేసులు, అనంతపురం జిల్లాలో 1,041 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 318 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 16,223 మంది కరోనా నుంచి కోలుకోగా, 81 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 13 మంది మృతి చెందారు.
ఏపీలో ఇప్పటివరకు 17,28,577 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 15,78,452 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,38,912 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల సంఖ్య 11,213కి చేరింది.