Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ కు 190 మందితో భారీ బృందాన్ని పంపించనున్న భారత్
- జులై 23 నుంచి జపాన్ లో ఒలింపిక్స్
- కరోనా నేపథ్యంలోనూ ముస్తాబైన టోక్యో
- త్వరలోనే తరలి వెళ్లనున్న భారత బృందం
- అర్హత సాధించిన 100 మంది భారత అథ్లెట్లు
జపాన్ లోని టోక్యో కేంద్రంగా జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారత్ ఈసారి భారీ బృందాన్ని పంపాలని నిర్ణయించింది. టోక్యో ఒలింపిక్స్ కు భారత్ నుంచి 100 మంది అథ్లెట్లు అర్హత సాధించారు. ఆథ్లెట్లు, ఇతర సిబ్బంది సహా మొత్తం 190 మందిని విశ్వక్రీడాసంరంభానికి పంపించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తలపోస్తోంది. ఈ మేరకు ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బాత్రా వెల్లడించారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో భారత క్రీడాకారులు ఒలింపిక్ కిట్లను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.
కాగా, టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన వారిలో 56 మంది పురుష అథ్లెట్లు కాగా, 44 మంది మహిళా క్రీడాకారిణులు. వీరు కాక మరో 35 మంది వరకు అర్హత సాధించే అవకాశాలున్నాయని ఐఓఏ భావిస్తోంది.
ఒలింపిక్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శన అంటే లండన్ ఒలింపిక్స్ అని చెప్పాలి. 2012లో జరిగిన లండన్ క్రీడల్లో మనవాళ్లు రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సహా 6 పతకాలు గెలిచారు. అయితే ఈసారి భారత బృందం రెండంకెల్లో పతకాలు సాధిస్తుందని ఐఓఏ ధీమా వ్యక్తం చేస్తోంది.