Etela Rajender: ప్రాణం ఉండగానే నన్ను బొంద పెట్టాలని ఆదేశించారు.. టీఆర్ఎస్‌కి రాజీనామా చేస్తున్నా: ఈటల రాజేందర్
- రాత్రికి రాత్రే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు
- ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారు
- నా వివరణ తీసుకోకుండానే ఈ పని చేశారు
- నాకు నా నియోజక వర్గ ప్రజలు భరోసా ఇచ్చారు
- నా వెంటే ఉంటామని చెప్పారు
తనను రాత్రికి రాత్రే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని, ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా, తన వివరణ తీసుకోకుండానే ఈ పని చేశారని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేటలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ నియోజక వర్గంలో తాము ప్రతి కార్యకర్తతో కలిసి మెలసి ఉండేవారమని చెప్పారు.
'అటువంటి హుజురాబాద్ నియోజక వర్గంలో ఈటల రాజేందర్ ను ప్రాణం ఉండగానే బొంద పెట్టారు. బతికి ఉండగానే నన్ను బొంద పెట్టాలని సీఎం ఆదేశించడంతోనే ఇలా చేస్తున్నారు. హుజురాబాద్‌లోని నాయకులకు డబ్బుల ఆశను చూపెడుతూ, మభ్యపెడుతున్నారు. అదీ కాకపోతే అనేక రకాలుగా ఇక్కడి ప్రజాప్రతినిధులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ ఫర్వాలేదు. హుజురాబాద్ నియోజక వర్గంలో టీఆర్ఎస్ ను బలపర్చింది ఈటల రాజేందర్ మాత్రమే' అని ఈటల రాజేందర్ తెలిపారు.
'ఇన్నాళ్లు నాతో కలిసి మెలసి తిరిగిన వారు నాపైనే కుట్రలు పన్నుతున్నారని నాతో ఈ ప్రాంత ప్రజలు అన్నారు. నువ్వు ఎట్ల తట్టుకోగలుగుతున్నావు బిడ్డా అని నన్ను అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మీద జరుగుతోన్న దాడి, కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తాం అని నాతో నా నియోజక వర్గ ప్రజలు చెప్పారు. నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు. నాపై జరుగుతోన్న కుట్రలు చూసి, నన్ను బర్తరఫ్ చేయడం చూసి హుజురాబాద్ ప్రజలంతా ఏదో కోల్పోయినట్లు భావించారు' అని ఈటల రాజేందర్ వివరించారు. 19 ఏళ్ల టీఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవమానించారు
టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీ-ఫారం ఇచ్చినా గెలిచాను అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 'అయితే, ఆయన తన సొంత కుమార్తెకు బీ-ఫారం ఇచ్చినా ఓడిపోయింది. నేను మాత్రం ఓడిపోలేదు. తెలంగాణ చిత్రపటంపై గర్వపడేలా గెలిచి వచ్చాను. తెలంగాణ కోసం పార్టీ ఎన్నిసార్లు రాజీనామా చేయాలని ఆదేశించినా నేను రాజీనామా చేశాను' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
'తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చాలా సార్లు నేను రాజీనామా చేశాను. గతంలో 17 మంది రాజీనామా చేసి పోటీచేస్తే గెలిచింది కేవలం ఏడుగురే. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారు. కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని ఆయన అన్నారు. అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లాం. ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారు' అని ఈటల రాజేందర్ తెలిపారు.
'ముఖ్యమంత్రిని కలవడానికి నేను గతంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి వెళితే గేటు వద్దే మమ్మల్ని ఆపేశారు. ఈ విషయం మీడియాకు తెలిస్తే మా పరువు పోతుందని వారికి చెప్పాం. రెండోసారి అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లాము. అప్పుడు కూడా గేటు వద్ద నుంచే వెనుదిరిగాము. బానిస కంటే నీచంగా మంత్రి పదవి ఉంది. ఎంపీ సంతోష్ కుమార్ తో నేను అప్పట్లో చెప్పాను. దీనికి ప్రగతి భవన్ అని కాకుండా బానిసల నిలయం అని పేరు పెట్టుకోవాలని అన్నాను' అని ఈటల రాజేందర్ తెలిపారు.