Etela Rajender: నేను మీకు బానిసను కాదు.. ఉద్యమ సహచరుడిని: కేసీఆర్ పై ఈటల ఫైర్
- ప్రగతి భవన్ గేటు వద్దే నన్ను ఆపేశారు
- ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
- మంత్రులపై నమ్మకం లేని కేసీఆర్ కు పాలించే హక్కు ఎక్కడిది?
మంత్రులను కేసీఆర్ బానిసలుగా చూస్తున్నారని... 19 ఏళ్లుగా టీఆర్ఎస్ లో ఉన్న తనను కూడా అగౌరవపరిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల మండిపడ్డారు. తాను బానిసను కాదనీ, ఉద్యమ సహచరుడినని ఆయన చెప్పారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు వెళ్తే... గేటు వద్దే తనను ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్ ల పార్టీల్లాంటిది టీఆర్ఎస్ కాదని... ఎంతో మంది ఉద్యమకారుల త్యాగఫలంతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుక్కోవాల్సిన అవసరం టీఆర్ఎస్ కు ఏమొచ్చిందని ఈటల ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను తాను ఏనాడూ వ్యతిరేకించలేదని... అయితే, బెంజ్ కార్లలో తిరిగే వారికి కూడా రైతుబంధు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన... తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటిస్తానని చెప్పారు. తన అనుచరులను కూడా టీఆర్ఎస్ పార్టీ బెదిరించిందని... అయినా వారు ధైర్యంగా నిలబడ్డారని అన్నారు.
తనది నక్సలైట్ అజెండా అని కేసీఆర్ చెప్పుకున్నారని... కానీ, వరవరరావును జైల్లో పెడితే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఈటల విమర్శించారు. సింగరేణి బొగ్గు గని సంఘాన్ని తాను పెట్టిస్తే, ఇప్పుడు దాన్ని కవిత నడుపుతున్నారని... ఆర్టీసీ యూనియన్ ను తాను, హరీశ్ రావు పెట్టిస్తే, ఇప్పుడు అది కవిత ఆధ్వర్యంలో ఉందని దుయ్యబట్టారు.
మంత్రుల మీదే నమ్మకం లేని కేసీఆర్ కు... నాలుగు కోట్ల ప్రజలను పాలించే హక్కు ఎక్కడిదని ఎద్దేవా చేశారు. సమ్మెలు చేయకుండా ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు అడ్డుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అని ప్రశ్నించారు.