Kate OBrien: చిన్నారులపై కరోనా ప్రాణాంతక ప్రభావమేమీ చూపదు: డబ్ల్యూహెచ్ఓ
- పిల్లల్లోనూ కరోనా వ్యాపిస్తోందని ప్రచారం
- స్పందించిన డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ నిపుణురాలు
- చిన్నారులపై కరోనా ప్రభావం పెద్దగా ఉండదని వెల్లడి
- పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రాధాన్యతాంశం కాదని వివరణ
కరోనా వైరస్ ఇప్పుడు పిల్లలపైనా ప్రభావం చూపుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ నిపుణురాలు కేట్ ఓబ్రైన్ స్పందిస్తూ... చిన్నారులపై కరోనా వైరస్ ప్రాణాంతక ప్రభావమేమీ చూపదని అన్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రాధాన్యతాంశం కాదని పేర్కొన్నారు. పిల్లలకు వైరస్ సోకినా అంతంతమాత్రమే ప్రభావం చూపుతుందని తెలిసినప్పుడు వ్యాక్సినేషన్ ఎందుకని కేట్ ఓబ్రైన్ వ్యాఖ్యానించారు. పిల్లలను పాఠశాలలకు పంపేముందు వ్యాక్సినేషన్ చేయడం అత్యవసరమేమీ కాదని, పిల్లలకు బదులు, ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడం మంచి ఆలోచన అవుతుందని వివరించారు.
కాగా, పిల్లలకు ఇచ్చే టీకాలను పేద దేశాలకు ఇవ్వాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ అభిప్రాయపడ్డారు. పలు దేశాల్లో 12 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్లు ఇస్తుండడం పట్ల ఆయన పై విధంగా స్పందించారు.