Elephant: చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు... మనసులను కదిలిస్తున్న వీడియో!
- కేరళలో ఘటన
- క్యాన్సర్ తో చనిపోయిన మావటి
- మావటి ఇంటికి వచ్చిన ఏనుగు
- నివాళులు అర్పించిన వైనం
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
కొన్ని జంతువులు, మనుషుల మధ్య అనుబంధం విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆ మావటి కుటుంబ సభ్యుడు ఏనుగును చూసి కన్నీటిపర్యంతమయ్యాడంటే ఆ కుటుంబానికి, ఏనుగుకు మధ్య ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది.
ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. ఆ మావటి పేరు కున్నక్కడ్ దామోదరన్ నాయర్. 74 ఏళ్ల నాయర్ ను స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కాగా, ఏనుగు పేరు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న కన్నుమూశాడు. ఈ సందర్భంగానే ఆ గజరాజును దాని యజమాని మావటి ఇంటికి తీసుకువచ్చారు. ఏనుగు బ్రహ్మదత్తన్ నివాళులు అర్పిస్తుండడాన్ని స్థానికులందరూ శోకతప్త నయనాలతో వీక్షించారు.