Pawan Kalyan: కారా మాస్టారు మృతి తెలుగు కథా సాహిత్యానికి తీరని లోటు: పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences to the demise of Kara Mastaru

  • ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత
  • వృద్ధాప్య సమస్యలతో మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • కారా మాస్టారు రచనలను గుర్తుచేసుకున్న వైనం

సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) కన్నుమూసిన సంగతి తెలిసిందే. జనసేనాని పవన్ కల్యాణ్ స్పందిస్తూ, కాళీపట్నం రామారావు గారు తుదిశ్వాస విడిచారనే విషయం తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని తెలిపారు. ఆయన తెలుగు భాషాప్రియులకు, సాహిత్యాభిమానులకు, రచయితలకు కారా మాస్టారుగా అభిమానపాత్రులని వెల్లడించారు.

కారా మాస్టారు అనగానే ఆయన రాసిన 'యజ్ఞం' గుర్తుకు వస్తుందని, అట్టడుగు వర్గాల ప్రజల జీవిత చిత్రాన్ని, బ్రతుకు సమరాన్ని, పేదలు దోపిడీకి గురవుతున్న వైనాన్ని అక్షరాల్లో చూపించారని పవన్ కొనియాడారు. తెలుగు కథా సాహిత్యం పట్ల కారా మాస్టారు చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు. ప్రచురితమైన ప్రతి కథను భద్రపరచడం ద్వారా భావితరాల వారికి అందించేందుకు శ్రీకాకుళంలో కథా నిలయం నెలకొల్పిన కారా మాస్టారు సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయం అని కొనియాడారు.

ఆయన మృతి తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, కారా మాస్టారు కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News