Vijayashanti: ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలోకి వెళతానంటే టీఆర్ఎస్ వాళ్లకు ఎందుకంత హైరానా?: విజయశాంతి
- టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల
- రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం
- ఈటలపై టీఆర్ఎస్ నేతల ఫైర్
- విమర్శనాస్త్రాలు సంధించిన విజయశాంతి
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. ఆయన రేపు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. మరికొన్నిరోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే, ఈటలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ పరిణామాలపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలను పదవితో సహా గుంజుకున్న టీఆర్ఎస్ పార్టీ... ఇవాళ ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరతానంటే ఎందుకు హైరానా పడుతోందని ప్రశ్నించారు.
సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరని ఈటల చెబితే, మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని... ప్రతి విమర్శలు చేసే బదులు సమర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను వెంటనే నియామకం చేయొచ్చు కదా? అని విజయశాంతి వ్యాఖ్యానించారు. వేరే అధికారులొస్తే సీఎం గారి కుటుంబ దోపిడీ కథలు బయటపడతాయన్న భయమేదైనా ఉందా? అంటూ విమర్శించారు.