NASA: ఫ్లయింగ్ సాసర్లపై తీవ్రంగా దృష్టి సారించనున్న నాసా
- గుర్తు తెలియని వస్తువులను గుర్తించిన అమెరికా నేవీ పైలట్లు
- గ్రహాంతరజీవుల వాహనాలంటూ ప్రచారం
- దీనిపై ఏమీ చెప్పలేమన్న నాసా చీఫ్
- మరింత పరిశోధించాల్సి ఉందని వెల్లడి
గ్రహాంతర జీవులు (ఏలియన్స్), యూఎఫ్ఓలు (ఫ్లయింగ్ సాసర్లు) ఎప్పటినుంచో మానవాళికి అంతుచిక్కని విషయాలుగా కొనసాగుతున్నాయి. ఆకాశంలో యూఎఫ్ఓలను చూశామని చాలామంది ఫొటోలను కూడా పంచుకున్నారు. అయితే, అవి కచ్చితంగా ఏలియన్స్ వాహనాలే అని ఎక్కడా నిరూపణ కాలేదు. ఇప్పుడీ అంశాన్ని తీవ్రంగా పరిశోధించాలని నాసా భావిస్తోంది. నాసా అధిపతి బిల్ నెల్సన్ యూఎఫ్ఓల గుట్టు విప్పే ప్రయత్నాలకు మరింత ప్రోత్సాహం అందించాలని నిర్ణయించుకున్నారు.
ఇటీవల అమెరికా నేవీ పైలెట్లు గగనతలంలో కొన్ని గుర్తు తెలియని వస్తువులను వీడియోలో రికార్డు చేశారు. దీనిపై నిగ్గు తేల్చాల్సి ఉందని బిల్ నెల్సన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్రహాంతరజీవులు భూమిని సందర్శించి వెళుతుంటారన్న దానికి యూఎఫ్ఓలే ఆధారాలన్న వాదనలను తాను విశ్వసించబోనని అన్నారు. అయితే, ఇలా జరగడానికి వీల్లేదు అని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు.
నేవీ పైలెట్లు చూసింది గ్రహాంతర జీవులనే అని మాకు తెలియదు, ఒకవేళ వారు చూసింది శత్రువులనా? అనేది కూడా తెలియదు, ఒకవేళ అదేమైనా ఎన్నడూ చూడని భ్రమ అనేది కూడా తెలియదు అని బిల్ నెల్సన్ వివరణ ఇచ్చారు. నేవీ పైలట్ల అనుభవంలోకి వచ్చిన విషయం మాత్రం ఓ భ్రమలా అనిపించడంలేదని, ఈ అంశాన్నే తాము పరిశోధించాలనుకుంటున్నామని తెలిపారు.