New Delhi: ఢిల్లీలో ఎల్లుండి నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లు ఓపెన్
- ప్రకటించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
- సరి–బేసి విధానంలో తెరుస్తామని వెల్లడి
- ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్ ఏ అధికారులు 100% హాజరు
- ఆ లోపు స్థాయి ఉద్యోగులు సగం మందితో డ్యూటీలు
- 50% సామర్థ్యంతో మెట్రోకు అనుమతి
ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ క్రమంగా లాక్ డౌన్ ను ఎత్తేస్తోంది. తాజాగా మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కేసులు 400 కన్నా తక్కువే వచ్చాయని, పాజిటివిటీ రేటు 0.5 శాతంగా ఉందని ఆయన చెప్పారు. దీంతో లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తేస్తున్నామన్నారు.
ఇప్పటికే అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టామని, ఇప్పుడు మరిన్ని సడలింపులను ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి షాపింగ్ మాళ్లు, మార్కెట్లను సరి–బేసి విధానంలో తెరుచుకోవచ్చని చెప్పారు. ఉదయం పదింటి నుంచి సాయంత్రం 8 గంటలకు షాపులను తెరవొచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు వంద శాతం విధులకు హాజరు కావాలన్నారు. ఆ లోపు గ్రేడ్ ఉద్యోగులు 50 శాతం మంది విధులకు రావాల్సి ఉంటుందని చెప్పారు.
అత్యవసర సేవల్లో ఉన్న వారు మాత్రం వంద శాతం డ్యూటీలకు రావాల్సి ఉంటుందన్నారు. ప్రైవేటు ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడుపుకోవచ్చని చెప్పారు. అయితే, వీలైనంత వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. 50 శాతం సామర్థ్యంతో ఢిల్లీ మెట్రో నడుస్తుందన్నారు. ఈ కామర్స్ సేవలనూ ప్రారంభించుకోవచ్చని చెప్పారు. మరిన్ని సడలింపులను రాబోయే రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారని, ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదని అన్నారు. అయినా, ముందునుంచే దానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. చిన్న పిల్లలను కరోనా నుంచి రక్షించేందుకు పీడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 420 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు.