Budda Venkanna: జగనన్న కాలనీల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు: బుద్ధా వెంకన్న
- దోచుకోవడానికే జగనన్న కాలనీలను తీసుకొచ్చారు
- ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు
- చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్లను పేదవాళ్లకు ఇవ్వండి
జగనన్న కాలనీల విషయంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని... ఇప్పుడేమో మాట తప్పి, ప్రజలే కట్టించుకోవాలని అంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 1.50 లక్షలతో ఇళ్లు కట్టుకోవడం సాధ్యమా? అని ప్రశ్నించారు. పేదవారంటే వైసీపీకి చులకన అని చెప్పారు. జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని అన్నారు.
టీడీపీ హయాంలో 90 శాతం పూర్తి చేసిన డబుల్ బెడ్ రూమ్ పనులను జగన్ వచ్చిన తర్వాత ఆపేశారని వెంకన్న మండిపడ్డారు. మరో 10 శాతం పనులు పూర్తి చేసి, పేదలకు ఆ ఇళ్లను అందించవచ్చని చెప్పారు. ఆ ఇళ్లను పక్కన పెట్టి, కమిషన్లను దోచుకోవడానికి హడావుడిగా జగనన్న కాలనీలను తెరపైకి తెచ్చారని విమర్శించారు. జగనన్న కాలనీల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారని అన్నారు.
పబ్లిసిటీ చేసుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవి క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించవని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ మంత్రులు జేబులు నింపుకున్నారని అన్నారు.
ఆరోగ్యశ్రీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారని... కానీ ఆసుపత్రుల్లో పేదలకు బెడ్లు కూడా దొరకవని విమర్శించారు. చంద్రబాబు పర్యటనలకు అనుమతులు ఇవ్వరని... ఆయన జూమ్ మీటింగ్ లపై విమర్శలు గుప్పిస్తారని మండిపడ్డారు. మీరు ప్రజలకు ఏమీ చేయరని... తాము చేయాలనుకుంటే అడ్డుకుంటారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కట్టిన ఇళ్లను పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.