KCR: జూన్ 7న డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశం
- 19 జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నోస్టిక్ సెంటర్లు
- జూన్ 7 న ప్రారంభం కానున్న వైద్య పరీక్ష కేంద్రాలు
- సెంటర్లలో 57 రకాల వైద్య పరీక్షలు
రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా వున్నాయనే విషయాన్ని వైద్యాధికారులు తన దృష్టికి తెచ్చిన నేపథ్యంలో, వాటిని సోమవారం నుంచి ప్రారంభించాలని సీఎం వైద్యాధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచామని కేసీఆర్ చెప్పారు.
సామాన్యుడికి వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చి ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేస్తున్నదని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. వైద్యంలో అత్యంత కీలకమైన డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్ర వైద్య చరిత్రలోనే గొప్ప సందర్భమని చెప్పారు.
ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అందులో కరోనా పరీక్షలతో పాటుగా రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీకి సంబంధించిన పరీక్షలు ఉంటాయన్నారు.