Jagan: ప్రకాశం జిల్లా వైద్యుడి ఊపిరితిత్తుల మార్పిడికి రూ.1.5 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
- కరోనా బారినపడిన డాక్టర్ భాస్కరరావు
- కారంచేడు ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న భాస్కరరావు
- పరిస్థితి విషమం
- ఊపిరితిత్తులు మార్చాలన్న డాక్టర్లు
- రూ. కోటి విడుదల చేయాలని కోరిన బాలినేని
- మొత్తం ఖర్చు భరిద్దామన్న సీఎం జగన్
ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యుడు భాస్కరరావు కరోనా బారినపడగా, ఇప్పుడాయన పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సి ఉండగా, రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే సీఎం జగన్ ఉదారంగా స్పందించి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ సాయం రూపంలో విడుదల చేశారు. ఈ విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడికి ఒక కోటి 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారని, దాంతో సీఎం జగన్ ను రూ.1 కోటి అడిగామని బాలినేని తెలిపారు. అయితే, సీఎం జగన్ పెద్దమనసుతో... కోటి కాదు, ఖర్చెంతైనా ఫర్వాలేదు, మనమే ఇద్దాం అని చెప్పారని, ఆ మేరకు రూ.1.5 కోట్లు విడుదల చేశారని బాలినేని వివరించారు. ఓ వైద్యుడి ప్రాణం కోసం ఒకటిన్న కోట్ల రూపాయలు విడుదల చేయడం మామూలు విషయం కాదని, సీఎం జగన్ ఎంతో చొరవ చూపి డాక్టర్ భాస్కరరావు చికిత్సకు నిధులు విడుదల చేశారని కొనియాడారు.