TRS: ఈటల వైఖరి తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్లుగా ఉంది: హరీశ్ రావు
- ఈటల పార్టీని వీడడం వల్ల ఎలాంటి నష్టం లేదు
- నేను పార్టీకి నిబద్ధత, విధేయత గల నాయకుడిని
- కేసీఆర్ గురువు, తండ్రి సమానులు
- ఊపిరి ఉన్నంత వరకు పార్టీలో ఇలాగే నడుచుకుంటా
- ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై హరీశ్ ఫైర్
పార్టీలో తనకు కూడా అనేక అవమానాలు జరిగాయంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. పార్టీని వీడడానికి ఈటలకు అనేక కారణాలు ఉండొచ్చని.. ఇలా తనపై తుపాకి పెట్టాలనుకోవడం విఫలయత్నమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈటల పార్టీ వీడడం వల్ల తెరాసకు ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీకి ఆయన చేసిన దానికంటే.. ఆయనకు పార్టీ ఇచ్చిందే ఎక్కువన్నారు. ఆయన గొడవలకు నైతిక బలం సమకూర్చుకునేందుకే తన పేరును ప్రస్తావిస్తున్నారని హరీశ్ తెలిపారు.
పార్టీలో తాను ఒక నిబద్ధత, విధేయత కలిగిన కార్యకర్తనని హరీశ్ తెలిపారు. పార్టీ ప్రయోజనాలకే తాను తొలి ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. పార్టీ అధినాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేయడమే తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదని.. తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులన్నారు. ప్రాణం ఉన్నంత వరకు పార్టీలో ఇలాగే నడుచుకుంటానని తెలిపారు. ఈటల రాజేందర్ వైఖరి తాచెడ్డ కోతి.. వనమెల్ల చెరిచిందన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.