Kakani Govardhan Reddy: ఆనందయ్య మందుపై సోమిరెడ్డివి తప్పుడు విమర్శలు: కాకాని
- ఆనందయ్య మందు నేపథ్యంలో మాటల యుద్ధం
- సోమిరెడ్డి వర్సెస్ కాకాని
- కాకాని కోట్లు కొల్లగొట్టే పథకం వేశాడన్న సోమిరెడ్డి
- దమ్ముంటే ఆధారాలు చూపించాలన్న కాకాని
ఆనందయ్య కరోనా మందు కేంద్రబిందువుగా వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆ మందును అమ్ముకునేందుకు ఎమ్మెల్యే కాకాని సిద్ధమయ్యారంటూ సోమిరెడ్డి ఆరోపించారు. పేదలకు ఉచితంగా ఇస్తున్న మందుతో కోట్లకు పడగలెత్తాలని కాకాని ప్లాన్ వేశారని తెలిపారు. అందుకోసం ఓ నకిలీ వెబ్ సైట్ ను కూడా రూపొందించారని, వెబ్ సైట్ లో మందు ధరను రూ.15 అని చూపిస్తూ, రూ.167 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై, ఎమ్మెల్యే కాకాని తీవ్రస్థాయిలో స్పందించారు.
ఆనందయ్య మందు విషయంలో సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. విపక్షాలు రాజకీయ రగడ సృష్టించాలని చూస్తున్నాయని విమర్శించారు. ఆనందయ్య మందుకు అనుమతులు వచ్చేవరకే తాను ప్రయత్నం చేశానని కాకాని స్పష్టం చేశారు. ఆనందయ్య మందు పంపిణీ విషయంలో పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంలో సోమిరెడ్డి తన స్థాయి నుంచి దిగజారి మరీ మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలతో బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఒక్క రూపాయి అవినీతి జరిగిందని సోమిరెడ్డి నిరూపించగలరా? అని కాకాని సవాల్ విసిరారు. సోమిరెడ్డికి తనను విమర్శించే హక్కులేదని స్పష్టం చేశారు. ఎక్కువగా మాట్లాడితే సోమిరెడ్డి అప్పుల చిట్టా విప్పాల్సి ఉంటుందని కాకాని హెచ్చరించారు. సోమిరెడ్డి పేకాటలో ఎంతమందికి అప్పులు ఉన్నాడో చెప్పాలని, ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. తనపై ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి ఆధారాలతో వస్తే విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కాకాని స్పస్టం చేశారు. దమ్ముంటే సోమిరెడ్డి ఆరోపణలు రుజువు చేయాలని అన్నారు.