Somireddy Chandra Mohan Reddy: సోమిరెడ్డిపై కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- సోమిరెడ్డిపై శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద చీటింగ్ కేసు
- సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై శేశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదా రెడ్డి ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదు చేశారు.
శేశ్రిత కంపెనీ, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు కాకాని కుట్ర చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అలాగే, మందు అమ్మకానికి నెల్లూరుకు చెందిన శేశ్రిత కంపెనీ వెబ్‌సైట్ తయారు చేసిందని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే శేశ్రిత ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నర్మదారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమ సంస్థపై సోమిరెడ్డి అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. సోమిరెడ్డి తమ డేటా చోరీ చేశారని అన్నారు. అలాగే, కాకానికి, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.