Donald Trump: కరోనా వైరస్ మూలాల విషయంలో ఫౌచీ జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశారు: ట్రంప్

US former president Donald Trump targets Anthony Fauci and China in Republican Party convention
  • రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు
  • ఫౌచీపైనా, చైనాపైనా విమర్శనాస్త్రాలు
  • ఫౌచీ గొప్ప డాక్టర్ కాదన్న ట్రంప్
  • కరోనాకు సంబంధించిన ప్రతి అంశంలో తప్పటడుగేనని వెల్లడి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో తన అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నట్టు మరోసారి ఉద్ఘాటించారు. నార్త్ కరోలినాలో రిపబ్లికన్ పార్టీ సమావేశానికి ట్రంప్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా వైరస్ జన్మస్థానం ఎక్కడన్న అంశంలో ఫౌచీ జీవితంలోనే అతి పెద్ద తప్పు చేశారని ట్రంప్ ఆరోపించారు.

కరోనా వ్యాపిస్తున్న తొలినాళ్లలో మాస్కులు పెట్టుకోనవసరం లేదన్న ఫౌచీ... ఆ తర్వాత మాస్కులు పెట్టుకోవాలని సూచించారని, ఆఖరికి తనే ఒక మాస్కర్ అయ్యారని విమర్శించారు. ఫౌచీ ఓ గొప్ప వైద్యుడు మాత్రమే కాదని, ఫౌచీ ఓ గొప్ప ప్రమోటర్ అని వ్యాఖ్యానించారు. కరోనాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ఫౌచీ తప్పుగా వ్యవహరించారని, వుహాన్ ల్యాబ్ విషయంలోనూ ఆయన వైఖరి సందేహాస్పదమేనని అన్నారు.

అటు, జో బైడెన్ కుటుంబీకులు చైనా అధికార పార్టీ నుంచి డబ్బు తీసుకుని అమెరికా ప్రజలకు అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. ఈ అంశాన్ని అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు, ఫేక్ మీడియా సంస్థలు పట్టించుకోవడం లేదన్నారు.

ముఖ్యంగా ట్రంప్ చైనాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా కారణంగా ప్రపంచ దేశాలకు జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. 10 ట్రిలియన్ డాలర్ల పరిహారం కూడా చాలా తక్కువేనని, చైనా నుంచి రుణాలు తీసుకున్న దేశాలు ఆ రుణాల చెల్లింపులను నిలిపివేయాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
Donald Trump
Anthony Fauci
Corona Virus
China
Wuhan Lab
USA

More Telugu News