Tennis: ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఫెదరర్
- ఇప్పటికే నాలుగో రౌండ్‌కు చేరుకున్న స్విస్ దిగ్గజం
- శరీరం సహకరించకపోవడమే కారణం
- కొన్ని నెలల క్రితం మోకాలికి శస్త్రచికిత్సలు
- 487 రోజుల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలోకి ప్రవేశం
487 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలోకి పునరాగమనం చేసిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్(39) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో శుభారంభం చేసినప్పటికీ.. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఫెదరర్ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. అయినప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమించేందుకే మొగ్గుచూపుతున్నట్లు ప్రకటించాడు.
కొన్ని నెలల క్రితం రెండు మోకాలి శస్త్రచికిత్సలు చేయించుకున్న ఫెదరర్ ఆట నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి కోలుకుంటున్నానని.. ఈ తరుణంలో తన శరీరాన్ని మరింత ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. దీనిపై తన టీంతో లోతుగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానన్నాడు.