Antibodies: కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు కలిగించే యాంటీబాడీలపై ఆసక్తికర అధ్యయనం!
- అధ్యయనం చేపట్టిన ఏకే సింగ్ బృందం
- 515 మంది ఆరోగ్య సిబ్బందిపై అధ్యయనం
- కొవిషీల్డ్ అత్యధిక యాంటీబాడీలు కలిగిస్తోందన్న పరిశోధకులు
- కొవిషీల్డ్ సీరోపాజిటివిటీ రేటు అధికమని వెల్లడి
సాధారణంగా ఓ వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు అభివృద్ధి చేయాలంటే అందుకు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దశాబ్దాల కిందట వచ్చిన హెచ్ఐవీ వంటి వైరస్ లకు ఇప్పటికీ సరైన వ్యాక్సిన్ లేదు. అయితే, కరోనా వంటి మహమ్మారిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు యుద్ధప్రాతిపదికన శ్రమించి వ్యాక్సిన్లను కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్లు కలిగించే యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయి? ఎంత మొత్తంలో ఈ వ్యాక్సిన్లు యాంటీబాడీలను తయారు చేయగలుగుతున్నాయి? అనే అంశాలపై భారత్ లో ఓ అధ్యయనం జరిగింది.
ప్రస్తుతం దేశంలో పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు కలిగించే యాంటీబాడీల శాతంపై ఈ అధ్యయనం చేపట్టారు. ప్రముఖ పరిశోధకుడు ఏకే సింగ్, ఆయన సహచరులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఇందుకోసం 515 మంది ఆరోగ్యసిబ్బందిపై పరిశోధన చేపట్టారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న అనంతరం వ్యాధి నిరోధక శక్తిని సరైన రీతిలో ప్రేరేపిస్తున్నట్టు గుర్తించారు.
కానీ, కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అధిక సంఖ్యలో యాంటీబాడీలు ఏర్పడుతున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. కొవిషీల్డ్ రెండు డోసులు పొందినవారిలో 98.1 శాతం సీరోపాజిటివిటీ రేటు గుర్తించగా, కొవాగ్జిన్ రెండు డోసులు పొందినవారిలో అది 80 శాతంగానే ఉందని తెలిపారు. కొవిషీల్డ్ తీసుకున్న వారిలో యాంటీబాడీ రేటు 115 ఏయూ/ఎంఎల్ (ఆర్బిట్రేటరీ యూనిట్స్ పర్ మిల్లీలీటర్) కాగా, కొవాగ్జిన్ తీసుకున్నవారిలో అది 51 ఏయూ/ఎంఎల్ గా నమోదైంది.
అయితే, ఈ యాంటీ స్పైక్ యాంటీబాడీల శాతాన్ని బట్టి, వ్యక్తికి ఆ స్థాయిలోనే రక్షణ కలుగుతుందని చెప్పలేమని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఐఎంఏ కొచ్చి విభాగం మాజీ అధిపతి డాక్టర్ రాజీవ్ జయదేవన్ అభిప్రాయపడ్డారు.