NASA: భూమి కవల గ్రహం శుక్రుడిపైకి నాసా ‘గూఢచారి’!

NASA To Explore Earth Twin with Davinici Plus

  • శుక్రుడి లెక్క తేల్చేందుకు ‘డావిన్సి+’
  • రెండు ప్రయోగాలు చేయనున్న నాసా
  • 2030 నాటికి వేడి గ్రహంపై ల్యాండింగ్

భూమికి కవల గ్రహం అని శుక్రుడికి పేరు. కారణం, ఒకప్పుడు దాని మీద భూమి లాంటి వాతావరణం ఉండడం, పరిమాణం, బరువు విషయంలో భూమిని పోలివుండడం వల్ల భూమి, శుక్ర గ్రహాలను కవలలు అని పిలుస్తుంటారు. అయితే, ఆ తర్వాత శుక్రుడి మీద వాతావరణం పూర్తిగా మారిపోయింది. సముద్రాలు ఎండిపోయాయి. వాతావరణం మొత్తం మందంగా తయారైపోయింది. ఎవరూ ఉండలేనంతగా వేడిగా ఉడుకెత్తిపోయింది (470 డిగ్రీల ఉష్ణోగ్రత). సల్ఫ్యూరిక్ ఆమ్లం, కార్బన్ డై ఆక్సైడ్ వంటి విషవాయువులతో నిండిపోయింది.

మరి, ఒకప్పుడు అందరూ బతికేందుకు అనువుగా ఉన్న శుక్ర గ్రహం.. ఇప్పుడెందుకు అలా మారింది? దాని మార్పులు ఎప్పుడు జరిగాయి? అన్న విషయాలను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంకల్పించింది. దాని గుట్టు తేల్చేందుకు గూఢచారిని పంపిస్తోంది. ఇటలీకి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన డావిన్సి పేరు మీదే ‘డావిన్సి+’ ప్రయోగాన్ని చేయనుంది. దీనిపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా చేసింది.


తాజాగా డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్, కెమిస్ట్రీ, ఇమేజింగ్ ప్లస్ (డావిన్సీ+) విశేషాలను వెల్లడించింది. 50 కోట్ల డాలర్లతో ప్రాజెక్టును చేపడుతోంది. శుక్రుడి ఉష్ణోగ్రతలు, పీడనం, గాలులను డావిన్సీ పరిశోధించనుంది. అంతేగాకుండా అందులోని అత్యంత శక్తిమంతమైన కెమెరాలు శుక్రుడిని ఫొటోలు తీయనున్నాయి. 2030లో ఈ ప్రయోగం జరగనుంది. ఆ గ్రహం (ఆల్ఫా రీజియన్)పై రోవర్, ల్యాండర్ ను దించాలని తాపత్రయపడుతోంది.

ఇవీ డావిన్సి+ విశేషాలు..

డావిన్సి+ స్పేస్ క్రాఫ్ట్ లో నాలుగు పరికరాలను అమర్చి శుక్రుడి వద్దకు పంపనున్నారు. వీనస్ మాస్ స్పెక్ట్రోమీటర్ (వీఎంఎస్), వీనస్ ట్యూనబల్ లేజర్ స్పెక్ట్రోమీటర్ (వీఎల్టీఎస్) అనే పరికరాలు.. శుక్ర గ్రహం వాతావరణంలోని వాయువులు, దాని ఉపరితలంపై శోధన చేయనున్నాయి. వీనస్ వాతావరణం ఎప్పుడు.. ఎలా మారిందనే విషయాన్ని తేల్చనున్నాయి. వీనస్ అట్మాస్ఫెరిక్ స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్ (వీఏఎస్ఐ) అనే మూడో పరికరం ద్వారా గ్రహం ఉష్ణోగ్రతలు, పీడనం, అక్కడి గాలుల దిశపై పరిశోధించనుంది.

గ్రహం దగ్గరకు చేరుకున్నాక స్పేస్ క్రాఫ్ట్ లోని వీనస్ డిసెంట్ ఇమేజర్ (వెండీ) అనే పరికరం ఆల్ఫా రీజియోలోని కొండలు, లోయ ప్రాంతాన్ని ఫొటోలు తీయనుంది. ఇక, నాలుగు కెమెరాలుండే వీనస్ ఇమేజింగ్ సిస్టమ్ ఫ్రమ్ ఆర్బిట్ ఫర్ రీకనైసెన్స్ (వైజర్ – వీఐఎస్ఓఆర్) అనే పరికరంతో గ్రహంపై అత్యంత ఎత్తైన ప్రాంతం ఇష్టార్ టెర్రాకు సంబంధించి ఓ మ్యాప్ ను తయారు చేయనుంది.

  • Loading...

More Telugu News