Nithyananda: నేను వచ్చానంటే కరోనా ఖతం: నిత్యానంద
- స్వామి నిత్యానందపై అత్యాచార ఆరోపణలు
- దేశం విడిచి పారిపోయిన వైనం
- ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉంటున్న నిత్యానంద
- కైలాస పేరిట సొంత దేశాన్ని ప్రకటించుకున్న స్వామి
అత్యాచార ఆరోపణలపై దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద మరోసారి తెరపైకి వచ్చారు. భారత్ లో కరోనా పరిస్థితులపై స్పందించారు. తాను భారత్ లో అడుగుపెడితే కరోనాకు అంతిమ సమయం ఆసన్నమైనట్టేనని వ్యాఖ్యానించారు.
నిత్యానంద ఈక్వెడార్ దేశం సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి దాన్ని కైలాస పేరిట ఓ దేశంగా ప్రకటించుకోవడం తెలిసిందే. సొంత కరెన్సీ, బ్యాంకులు, ప్రత్యేక పాస్ పోర్టులు ఇలా పలు అంశాలతో తన కైలాస ఓ దేశమేనని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన దేశాన్ని గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరారు. అంతేకాదు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన దేశానికి కొన్ని యూరప్ దేశాల నుంచి రాకపోకలను కూడా నిషేధించారు. ఈ మేరకు ఆయా దేశాల దౌత్య కార్యాలయాలకు లేఖలు కూడా రాశారు.
కాగా, భారత్ నుంచి పరారైన తర్వాత నిత్యానంద తరచుగా శిష్యులతో మాట్లాడుతున్నట్టు వెల్లడైంది. ఈ క్రమంలో ఓ శిష్యుడు కరోనాపై అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. తాను భారత గడ్డపై ఎప్పుడు కాలు మోపితే అప్పుడే కరోనాకు ఆఖరి ఘడియలు అని పేర్కొన్నారు.