NIV: కొత్త రకం కరోనాను గుర్తించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ
- మరింత వేగంగా వ్యాపించే గుణం
- నిర్వీర్యానికి అధిక యాంటీబాడీలు అవసరం
- బ్రెజిల్ పర్యాటకుల్లో గుర్తింపు
- భారత్‌లో లేని వ్యాప్తి
- వెల్లడించిన ఎన్‌ఐవీ
పూణెలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)’ మరో కొత్త కరోనా రకాన్ని గుర్తించింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాపిస్తుందని, ఎక్కువ ప్రాణాంతకమైందని తెలిపింది. దీన్ని ఎదుర్కోవడానికి మరిన్ని ఎక్కువ యాంటీబాడీలు కావాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. బి.1.1.28.2గా పేర్కొంటున్న ఈ రకం బ్రెజిల్ నుంచి వచ్చిన ఇద్దరు పర్యాటకుల్లో మాత్రమే గుర్తించినట్లు తెలిపింది. భారత్‌లో వైరస్ బాధితుల నమూనాలపై జరిపిన జన్యుక్రమ విశ్లేషణలో దీని ఉనికిని గుర్తించలేదని స్పష్టం చేసింది.
ఈ వేరియంట్‌ను గతంలోనూ గుర్తించినట్లు ఎన్‌ఐవీ వర్గాలు తెలిపాయి. భారత్‌లో దీని వ్యాప్తి లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్‌లో ఇప్పటి వరకు 12,200 ఆందోళనకర కరోనా వైరస్ రకాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో చాలా వరకు కనుమరుగైనప్పటికీ.. డెల్టా వేరియంట్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రెండో దశ విజృంభణకు ఇదే ప్రధాన కారణం.