Recovery Rate: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా రికవరీ రేటు
- గత 24 గంటల్లో 2,982 మందికి కరోనా నయం
- ఇప్పటివరకు కోలుకున్న 5.67 లక్షల మంది
- 95.34 శాతానికి పెరిగిన రికవరీ రేటు
- రాష్ట్రంలో తాజాగా 15 మరణాలు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 2,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుంచి విముక్తులైన వారి సంఖ్య 5,67,285కి పెరిగింది. ఈ క్రమంలో కొవిడ్ రికవరీ రేటు మరింత మెరుగైంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 95.34 శాతానికి పెరిగింది.
ఇక రోజువారీ కేసుల విషయానికొస్తే... గత 24 గంటల్లో 1,33,134 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,897 పాజిటివ్ కేసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 182, ఖమ్మం జిల్లాలో 163, నల్గొండ జిల్లాలో 151, రంగారెడ్డి జిల్లాలో 114, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,95,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 24,306 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్కరోజులో 15 మంది మరణించగా, ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,409కి చేరింది.