Barbara Jabarika: తన పేరు రాజ్ అని చెప్పుకున్నాడు... మేహుల్ చోక్సీ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించిన 'మిస్టరీ ఉమన్'

Mystery Woman Barbara Jabarika speaks about Mehul Choksi

  • డొమినికాలో పట్టుబడిన చోక్సీ
  • అంతకుముందు చోక్సీ వెంట మిస్టరీ ఉమన్
  • ఆమె బార్బరా జబారికా అని పేర్కొన్న చోక్సీ న్యాయవాది
  • ఓ మీడియా సంస్థతో మాట్లాడిన జబారికా

డొమినికా పోలీసులకు పట్టుబడిన పీఎన్బీ స్కాం నిందితుడు మేహుల్ చోక్సీ గురించి ఈ వ్యవహారంలో మిస్టరీ ఉమన్ గా గుర్తింపు పొందిన బార్బరా జబారికా ఆసక్తికర వివరాలు వెల్లడించింది. తన పేరును రాజ్ అని చెప్పుకునేవాడని, ఆంటిగ్వాలో చాలామంది అతడిని ఆ పేరుతోనే పిలిచేవాళ్లని వెల్లడించింది. 6 నెలల్లో 6 సిమ్ కార్డులు మార్చాడని, అనేక సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి చాటింగ్ చేసేవాడు అని వివరించింది.  

తన నుంచి మేహుల్ చోక్సీ స్నేహాన్ని మించి ఆశించాడని తెలిపింది. అయితే తనకు మాత్రం ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. తన హోటల్ రూం బిల్లులు, విమాన టికెట్లు అన్నీ చోక్సీనే భరించేవాడని, అతడు ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నాడో తనకు అర్థమైందని జబారికా తెలిపింది. తన అపార్ట్ మెంట్ కు చోక్సీ వచ్చేవాడని, అతడి ఎత్తుగడలు అర్థం కావడంతో, అతడి ఆఫర్లను తాను తిరస్కరించేదాన్నని జబారికా పేర్కొంది.

నా స్నేహాన్ని చోక్సీ తప్పుగా అర్థం చేసుకున్నాడు అని వివరించింది. నేను స్థిరాస్తి వ్యాపారాలు చూసుకుంటుండడంతో, నా పేరిట పెట్టుబడులు పెడతానంటూ ముందుకొచ్చాడు అని వివరించింది. పలు సందర్భాల్లో నకిలీ డైమండ్ రింగ్స్ కానుకగా ఇచ్చాడని వెల్లడించింది.

పీఎన్బీ స్కాంలో నిందితుడైన మేహుల్ చోక్సీ భారత్ నుంచి పారిపోయి ఆంటిగ్వాలో తలదాచుకోవడం తెలిసిందే. అయితే, మే 23న ఆయన అదృశ్యం కావడం, ఆ తర్వాత రెండ్రోజులకే డొమినికా పోలీసులకు పట్టుబడడం నాటకీయంగా జరిగాయి. ఈ క్రమంలోనే మేహుల్ చోక్సీతో ఓ మహిళ కలిసి ఉన్న ఫొటోలు తెరపైకి వచ్చాయి. ఆ మహిళ ఎవరో తెలియకపోవడంతో అందరూ మిస్టరీ ఉమన్ గా పిలవడం ప్రారంభించారు. చోక్సీ న్యాయవాది మాత్రం ఆమె పేరును బార్బరా జబారికా అని పేర్కొన్నారు. ఈ క్రమంలో జబారికా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పై వివరాలు వెల్లడయ్యాయి.

  • Loading...

More Telugu News