Social Media: కొత్త ఐటీ చట్టాల అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: ట్విట్టర్‌

Taking every step to comply with new Indian it rules says twitter

  • తొలుత అమలుకు ససేమిరా
  • కేంద్రం ఘాటు లేఖతో దిగొచ్చిన సామాజిక మాధ్యమం
  • కరోనా ప్రభావం వల్లే సకాలంలో అమలుకు కుదరలేదని వ్యాఖ్య
  • ఒప్పందం ప్రాతిపదికన నోడల్‌, గ్రీవెన్స్‌ అధికారి నియామకం
  • తుది దశకు చేరుకున్న చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారి ఎంపిక ప్రక్రియ

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలను పాటించేందుకు తొలుత ససేమిరా అన్న ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ఎట్టకేలకు దిగొచ్చింది. చివరి అవకాశం ఇస్తూ కేంద్రం రాసిన ఘాటు లేఖకు సానుకూలంగా స్పందించింది. భారత చట్టాలకు కట్టుబడి ఉండేందుకు అంగీకరించింది. అందుకు కొంత సమయం కావాలని కోరింది.  

తాజాగా భారత కొత్త ఐటీ నిబంధనల అమలుకు ప్రతి చర్యా తీసుకుంటున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు భారత్‌లో గ్రీవెన్స్‌, నోడల్‌ అధికారులను ఒప్పంద ప్రాతిపదికన నియమించినట్లు తెలిపింది. చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్‌ను నియమించే ప్రక్రియ తుది దశలో ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. ఫిబ్రవరి 25న ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను నోటిఫై చేసినట్లు ట్విట్టర్‌ గుర్తుచేసింది. కానీ, మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వెంటనే ఏర్పాట్లు చేసుకోవడం సాధ్యం కాలేదని వివరించింది.

కొత్త నిబంధనల ప్రకారం- వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు భారత్‌లో ఓ అధికారిని ట్విట్టర్ నియమించాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగిస్తుందనిపించిన సందేశాలేమైనా ఉంటే వాటి మూలాల వివరాలను ప్రభుత్వం లేదా న్యాయస్థానం అడిగితే తెలియజేయాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News