Mehul Choksi: ఛోక్సీ నిషేధిత వలసదారే: డొమినికా ప్రకటన
- భారత్ కు అప్పగించాలంటూ పోలీసులకు ఆదేశం
- కోర్టుకు ఆర్డర్ ప్రతిని సమర్పించిన అధికారులు
- మే 25వ తేదీతోనే ఆర్డర్ కాపీ
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ ‘నిషేధిత వలసదారే’నని డొమినికా ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వ వాదనను బలపరిచేలా ఆ దేశ జాతీయ భద్రత హోం వ్యవహారాల శాఖ ఇవాళ ప్రకటన చేసింది. ‘‘ఇమిగ్రేషన్ అండ్ పాస్ పోర్ట్ చట్టం చాప్టర్ 18:01 సవరణ రూల్స్ లోని సెక్షన్ 5(1)(ఎఫ్) ప్రకారం ఛోక్సీని నిషేధిత వలసదారుగా ప్రకటిస్తున్నాం’’ అని వెల్లడించింది.
దాని ప్రకారం చోక్సీకి డొమినికాలోకి అనుమతి లేదని పేర్కొంది. అతడిని తన సొంత దేశానికి (భారత్) అప్పగించాల్సిందిగా చీఫ్ ఆఫ్ పోలీస్ ను ఆదేశించింది. మే 25వ తేదీతోనే డొమినికా మంత్రి రేబర్న్ బ్లాక్ మూర్ ఈ ఆదేశాలను ఇవ్వడం గమనార్హం. అయితే, విచారణలో భాగంగానే ఈ ఆర్డర్ కాపీని అధికారులు కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది.
భారత్, ఆంటిగ్వా పోలీసులు ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ నుంచి తనను కిడ్నాప్ చేశారని, డొమినికాకు తీసుకొచ్చారని ఛోక్సీ ఆరోపించాడు. జైలులో తనను చిత్ర హింసలు పెట్టారన్నాడు. అయితే, డొమినికా అధికారులు మాత్రం అక్రమంగా ప్రవేశించడం వల్లే అరెస్ట్ చేశామని తేల్చి చెప్పారు. భారత్ కు అప్పగించకుండా చూడాలని ఛోక్సీ వేసిన పిటిషన్ ను డొమినికా హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.