Congress: అక్కర్లేదు వెళ్లిపొమ్మంటే.. వెళ్లిపోతాం: కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్ సిబల్​

Kapil Sibal Once Again Critical About Congress Errs

  • బీజేపీలో మాత్రం చేరబోనని స్పష్టీకరణ
  • అదే జరిగితే తాను చచ్చిపోయినట్టేనని వ్యాఖ్య
  • కాంగ్రెస్ లో సమస్యలు అలాగే ఉన్నాయని కామెంట్
  • పరిష్కరించనంత వరకు ఎత్తిచూపుతూనే ఉంటామని వెల్లడి

కాంగ్రెస్ లో సంస్కరణలు చేయాల్సిన తరుణం వచ్చిందని, తాము చెప్పే మాటలను నాయకత్వం ఇకనైనా వినాలని పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలను ఇంకా పరిష్కరించలేదని, అది నిజమని అన్నారు. వాటిని పరిష్కరించనంతవరకూ వాటి గురించి వేలెత్తి చూపుతూనే ఉంటామన్నారు. పార్టీ నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్టేనని ఆయన అన్నారు.

ఒకవేళ తాము అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని అన్నారు. అయితే, బీజేపీలో మాత్రం చేరేది లేదని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని అన్నారు. తాను బీజేపీలో చేరడమంటే తాను చచ్చిపోయినట్టే లెక్క అని అన్నారు. కాంగ్రెస్ నుంచి కీలకమైన నేత బీజేపీలోకి వెళ్లడంతో.. తాజాగా ‘జీ 23’ అసమ్మతి వర్గం చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీలో సమూలమైన మార్పులు చేయాల్సిందేనని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గతంలో ఆ వర్గం నేతలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా దానిపైనే సిబల్ స్పందించారు.

పార్టీ అధిష్ఠానానికీ పలు సూచనలు చేశారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపై ఘాటుగా స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలని అన్నారు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు.

పార్టీ ఏం చేసింది? ఏం చేయలేదు? అన్నది తనకు అనవసరమని అన్నారు. ప్రస్తుత రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందన్నారు. పార్టీని వీడడంలో జితిన్ కు కారణాలుండి ఉండొచ్చన్నారు. ఆయన పార్టీని వీడినందుకు విమర్శలు చేయాల్సిన అవసరం లేదని, కానీ, పార్టీని వీడేందుకు ఆయన చెప్పిన కారణాలనే విమర్శించాలన్నారు.

  • Loading...

More Telugu News