Uttar Pradesh: అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు: యూపీ మహిళా కమిషన్ సభ్యురాలి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఫోన్లిస్తే గంటలపాటు అబ్బాయిలతో బాతాఖానీ
- ఆ తర్వాత దూరంగా పారిపోవడం
- అసలు అమ్మాయిలకు ఫోన్లను ఇవ్వొద్దు
- తల్లే కూతుర్లను చూసుకోవాలని కామెంట్
అమ్మాయిల ఫోన్ల వినియోగంపై ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు అతిగా ఫోన్లు వాడడం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కాబట్టి అమ్మాయిలు ఫోన్లు వాడొద్దని అన్నారు. అలీగఢ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘అమ్మాయిలకు అసలు ఫోన్లు ఇవ్వొద్దు. గంటలకొద్దీ అబ్బాయిలతో బాతాఖానీలు కొడుతున్నారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఫోన్లను చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటి విషయాలు తెలియడం లేదు’’ అని ఆమె అన్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందన్నారు.
తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు.. తమ కూతుర్లను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. కూతుర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే దానికి కారణం తల్లుల నిర్లక్ష్యమేనన్నారు. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజూ చౌదరి.. ఫోన్లను లాక్కున్నంత మాత్రాన మహిళలపై లైంగిక హింస ఆగదన్నారు.