Gutta Sukhender Reddy: ఈటల తనను తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- ఈటలపై గుత్తా విమర్శలు
- ఈటలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడి
- ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి వెళుతున్నారని ఆరోపణ
- ఉప ఎన్నికలో ఈటలకు ఓటమి ఖాయమని స్పష్టీకరణ
బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ఎంతో గుర్తింపు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఈటల రాజకీయంగా తనను నాశనం చేసుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని, ఎవరూ ఎవర్నీ నాశనం చేయలేరని తెలిపారు.
ఇవాళ తన ఆస్తులను రక్షించుకోవడం కోసమే ఈటల బీజేపీలోకి వెళుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పతనమవుతోందని అన్నారు. ఉప ఎన్నికలో ఈటలకు ఓటమి ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. మరో రెండు దశాబ్దాల పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురులేదని ధీమాగా చెప్పారు. 2026 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు మారతాయని, నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా అప్పటికి పూర్తవుతుందని తెలిపారు.