Jagan: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను కలిసిన సీఎం జగన్
- ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం జగన్
- వరుసగా కేంద్ర ప్రముఖులతో భేటీలు
- రాష్ట్రాభివృద్ధిపై చర్చలు
- నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు పలు అంశాల నివేదన
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను కలిశారు. పార్టీ ఎంపీలతో కలిసి వరుసగా కేంద్ర ప్రముఖులతో భేటీ అవుతున్న సీఎం జగన్... రాజీవ్ కుమార్ తో భేటీ సందర్భంగా పేదలకు ఇళ్ల పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 30.76 లక్షల ఇళ్ల కోసం 68,381 ఎకరాల భూమి సేకరించామని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీతో 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయని చెప్పారు.కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.34,109 కోట్లు ఖర్చవుతాయని వెల్లడించారు. మౌలిక సదుపాయాల ఖర్చును పీఎంఏవైలో భాగం చేయాలని కోరారు.
అటు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైనా సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తో మాట్లాడారు. రూ.55,656.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కాసేపట్లో సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.