Sharad Pawar: మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది: శరద్ పవార్
- ఇటీవల మోదీతో ఉద్ధవ్ భేటీ
- అంతకుముందు ఫడ్నవీస్‌తో పవార్ సమావేశం
- ప్రభుత్వ మనుగడపై ఊహాగానాలు
- నేడు కొట్టిపారేసిన శరద్ పవార్
- రానున్న ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తామని విశ్వాసం
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విశ్వాసం వ్యక్తం చేశారు. తర్వాత రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎంవీఏ (శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్) కూటమి మంచి ఫలితాల్ని సాధిస్తుందని తెలిపారు. పరోక్షంగా 2024 ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఎన్సీపీ 22వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంవీఏ ప్రభుత్వ మనుగడపై అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని శరద్ పవార్ తెలిపారు. కానీ, శివసేన.. విశ్వాసం ఉంచగలిగే పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ థాకరే సైతం ఇందిరాగాంధీకి తెలిపారని గుర్తుచేశారు. విభిన్న సిద్ధాంతాలు గల మూడు పార్టీలు కలుస్తాయని ఊహించలేదని పవార్ అభిప్రాయపడ్డారు. కానీ, మూడు పార్టీలు ఏకతాటిపై సజావుగా సాగుతున్నాయని తెలిపారు. కొవిడ్-19పై కలిసికట్టుగా పోరాడుతున్నాయన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం మోదీతో తనకు సత్సంబంధాలే ఉన్నట్లు తెలిపారు. మరోవైపు శరద్ పవార్ సైతం ఇటీవల బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంవీఏ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో శరద్ పవార్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.