Corona Virus: ఓకేసారి అందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు.. దీనివల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం!: వైద్య నిపుణులు
- ప్రధానికి లేఖ రాసిన వైద్య నిపుణులు
- సామూహిక వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం లేదని వెల్లడి
- అవసరమైన వారికి చేరే అవకాశం లేదని అభిప్రాయం
- ముప్పు ఉన్నవారికే టీకా ఇవ్వాలని సూచన
- వయోజనులు, పిల్లలకు ఇప్పుడే అవసరం లేదని హితవు
సరైన ప్రణాళిక లేని వ్యాక్సినేషన్ విధానం వల్ల మరిన్ని కొత్త కరోనా రకాలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తూ పలువురు ప్రముఖ వైద్య నిపుణులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో సామూహిక, విచక్షణారహిత, అసంపూర్ణ వ్యాక్సినేషన్ వల్ల తీవ్ర పరిణామాలుంటాయని తెలిపారు. లేఖ రాసిన వారిలో ఎయిమ్స్ వైద్యులతో పాటు ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమాలజిస్ట్‌కు చెందిన నిపుణులు ఉన్నారు.
సామూహికంగా జనాభా మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వడానికి బదులు వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్నవారికి తొలుత ఇవ్వాలని నిపుణులు లేఖలో సూచించారు. వైరస్ వ్యాప్తిపై ఉన్న శాస్త్రీయ సమాచారం, ధ్రువీకరించిన గణాంకాల ఆధారంగానే ముందుకు సాగాలని హితవు పలికారు. అలా కాకుండా అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్ల జనాభాలో చాలా తక్కువ మందికి టీకాలు చేరతాయని.. దీని వల్ల వైరస్ కట్టడిపై పెద్దగా ప్రభావం ఉండదని తెలిపారు. పిల్లలు, వయోజనులకు కూడా టీకా ఇవ్వాలన్న నిర్ణయానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని అభిప్రాయపడ్డారు.